Thursday, February 03, 2011

క్యూబన్ చుట్ట (Cuban Cigar)

నీ చేతుల తో తాకి
నిప్పంటిస్తావు!
నీ పెదవులతో
నా జీవాన్ని, జవాన్ని
కసి గా జుర్రుకుంటావు...

నీ మోహానికి, వ్యామోహానికి
నేను కాలి తెరలు తెరలు గా
తరిగి పోతూ
నీ నర నరాల్లో సమ్మిళితమై...
కృంగి కృశించి పోతుంటే
నీకు ఆనందం!

నా తావి ఉన్నంతవరకే
నీ మోవి కి, నాకూ ముడి

******************
వివాహం వ్యాపరమైనపుడు
విడాకులు కొనుగోళ్ళు అయినపుడు
ఆలుమగల సంబంధం
ఒక చట్టబద్ధమైన బంధమే కదా!

యోగానంద్
02-03-2011




ప్రవాహం

పెను లోతులు తవ్వుతూ
అక్షర శిల్పాలను చెక్కుతూ
అనర్గళంగా ప్రవహించే
కొలొరాడో నది లా -
మస్తిష్క లోలోతుల్లో
నేను పయనిస్తూ ఉంటా

ఆనకట్ట లా!
నాకు లొంగి
నాలో కలిసిపోతాయి!
నా శక్తి కి రూపాన్నిస్తాయి...

నన్నందరూ గ్రహించలేరు...
కొందరు మాత్రం-
నాలో మమేకమై
మళ్లీ జన్మిస్తారు

అగ్ని గర్బం లోంచి
పుట్టిన సెకోయా చెట్ల లా
ఆకాశాల్నేదిరిస్తూ
పైపైకెదిగిపోతారు
సంశప్తకులై...
కవులై నిలుస్తారు!

03-31-2007
యోగానంద్

ఈ కవిత కి మూడేళ్ళ క్రితం వంగూరి సంస్థ వారి కవిత రచన పోటీ లలో మొదటి బహుమతి వచ్చింది. ఇది ఇక్కడ (నా బ్లాగ్) లేదని గ్రహించి మళ్లీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నా...









Sunday, January 10, 2010

నక్షత్ర వర్షం (Translation included)

ఆకాశమా!
వర్షించు నక్షత్రాల్ని-
ఎక్కడో నిశీధి గొన్న
యోసమిటీ అడవుల్లోనో
టొరోవీప్ ఎడారుల్లోనో కాదు..
ఈ మిల్పీటస్ కొండల నడుమ,
సిలికాన్ లోయల్లోనూ..
వర్షించు...
వర్షించు నక్షత్రాల్ని...

ప్రతి మునిమాపు వేళ లో-
ఆ రంగులు చిదిమిన మేఘాలు,
అలా నవ్వుతూ శఠించి పోయే-
పేదరికపు కల్లాపు జల్లి
అలా నీ దారిన పారిపోయే
ఆ మేఘాల తెరలను ఛేదిస్తూ
వర్షించు నక్షత్రాల్ని...

పొద్దుపొడవగానే పొంచి ఉన్న
పేదరికపు చీకట్లని,
నా నుంచి నన్నే దూరం చేసే
ఈ పేదరికపు చీకట్లని,
నన్ను భయపెట్టి కృంగదీసే
ఈ చీకట్లని-

ఎదుర్కోనే శక్తినున్మేషిస్తూ
వర్షించు నక్షత్రాల్ని-

ఎక్కడో నిశీధి గొన్న
యోసమిటీ అడవుల్లోనో
టొరోవీప్ ఎడారుల్లోనో కాదు-
నా ముంగిట్లో వర్షించు...
వర్షించు నక్షత్రాల్ని

-
యోగానంద్
10/05/09

A very rudimentary one (not as good as in original Telugu but bear with me...)..I might be editing more...as I go along..

Translation:

Oh the skies!

Rain the stars (tonight)-
Not in the isolated serenity
Of the Yosemite forests
Or the Toroweep desert...
In the midst of these Milpitas hills
In the Silicon Valley
Rain..
Rain the stars

In every twilight hour
Ripping through those clouds-
Those clouds that spray the "colors",
Those clouds with that feigning smiles
That betray and run away,
Those very clouds that sprinkle
Showers of poverty in my frontyard
And trail away in your path-
Ripping through them...
Rain the stars...

Rain the stars
To bless me with the courage
To face-
On the onset of every dawn-
The darkness of poverty that engulfs me,
That separates me from myself,
That scares and emaciates me...

Oh the skies!
Rain the stars...
Rain the stars (tonight)-
Not in the isolated serenity
Of Yosemite forests
Or the Toroweep desert...
In the frontyard of my home,
My sweet home...

Rain...
Rain the stars...

Wednesday, October 07, 2009

ఎంత అద్భుత ప్రపంచం! (Attempted) Translation of What a wonderful World Song

నే చూస్తూ ఉంటా-
ఆ పచ్చని చెట్లు,
ఆ ఎర్ర గులాబీలూ,
నే చూస్తూ ఉంటా అవి వికసించటం
నా కోసం, నీ కోసం...

నాలో నేననుకుంటూ ఉంటా...
"ఎంత అద్భుత ప్రపంచం!"

నే చూస్తూ ఉంటా-
ఆ నీలి ఆకాశం,
ఆ తెల్లటి మేఘాలు,
ఈ వెలుగుజిమ్మే చక్కటి పగలు
ఈ పవిత్ర మైన చిక్కటి రేయి...

నాలో నేననుకుంటూ ఉంటా...
"ఎంత అద్భుత ప్రపంచం!"

ఆ రంగుల ఇంద్రధనుస్సు-
ఆకాశంలో ఎంత అందం!
అవే రంగులు జనాల మోముల్లో
కూడా అంత అందం!

నే చూస్తూ ఉంటా
ఆ స్నేహితుల చేతి కలయికలు
ఆ "బావున్నావా" అని పలకరింతలు...
నిజానికి "నువ్వంటే ఇష్టమ" ని చెప్పటాలు!

నే వింటూ ఉంటా
ఆ చంటిపిల్లల రాగాలు
నే చూస్తూ ఉంటా వాళ్ళు పెరిగి పెద్దవడం-
ఎన్నో నేర్చుకుంటారు
నేనెన్నటికీ నేర్వలేనివి...

నాలో నేననుకుంటూ ఉంటా...
"ఎంత అద్భుత ప్రపంచం!"

ఆ...నేననుకుంటూ ఉంటా...
"ఎంత అద్భుత ప్రపంచం!"

-యోగానంద్
10/07/09

"What a wonderful world" అన్న లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్ (Louis Armstrong) గీతానికి అనువాద ప్రయత్నం...ఎంత ఫలించిందన్నదీ చదువరులే చెప్పాలి. ఆ పాట యూ ట్యూబ్ లో వినొచ్చు:

http://www.youtube.com/watch?v=vnRqYMTpXHc

Monday, May 11, 2009

నిప్పురవ్వ

మోహమనే సముద్రం లో
ములిగిపోయాను-
ప్రేమ అనే అగ్ని లో
కాలి పోయాను-

సంస్కరించబడి,
ఆ అగ్నిగర్భం లోంచే-
నిలుపు లేని క్షణాలలో
నిలువలేని నిప్పురవ్వలా...

యోగా

Translation:

In the ocean of infatuation-
I was drowned
and
In the fire of love-
I was burned

Cleansed and reborn
In that womb of fire..

None but a spark
fleeting in the fleeting moment...

Wednesday, July 25, 2007

వింత!

కళ్ళు తెరిచి వెతికిన నిజం
కల్లగానే ఊరించింది

కనువిప్పు కలిగినపుడు
మాత్రం-

కళ్ళు మూసుకున్నాయి,
హృదయ గవాక్షాలు
తెరుచుకున్నాయి!

యోగానంద్
07/26/07

Translation (attempted):

Wonder!

Searching for the truth
With eyes wide open
Was always an alluring illusion

But when the truth dawned on me...
Eyes were closed...
And my heart opened!

Sunday, April 29, 2007

సెకోయా

సెకోయా సెకోయా
అంతెత్తెలా ఎదిగిపోయావ్?
కలకాలం పచ్చగా ఎలా ఉంటావు?

"అగ్ని గర్భం లో పుట్టాను,
ఒంటరిని...
ఆ సూరీడే నా స్నేహితుడు.
నా జీవితమంతా పైకే చూస్తుంటా...
మరోలా ఉండగలనా!"

04-29-07
యోగానంద్
PS: ఇస్మాయిల్ గారి "సెలయేరు" కవిత స్ఫూర్తి తో...

Thursday, March 29, 2007

Haiku 11

కంట నీరు
పెదవి దాకా చేరి...
చిరునవ్వైపోతోంది:-)

03-29-07
యోగానంద్

Haiku 10

కంట నీరు
గుండె దాకా జారి
ఆవిరైపోతోంది...

03-29-06
యోగానంద్

Friday, March 02, 2007

దగ్గు

దగ్గుతున్నాడు రోగి
అసలు ఆపుకోలేకుండా-
మెల్లగా క్షిణించుకు పోతున్నాడు,
గుండెల్లో మండుతున్న
కల్మషమంతాబైటికొచ్చేస్తోంది,
తేలిగ్గా ఉంటోంది-
అలానే క్షిణించి పోతున్నాడు
అసలాపుకోలేకుండా దగ్గుతున్నాడు...

ఈ చావు బతుకుల కొట్లాట లో
ప్రతి దగ్గు తరవాత
మరో జన్మెత్తినట్టు
ఆనంద పడిపోతున్నాడు!

3-02-07
యోగానంద్
PS:- అసలు నిద్ర కూడా పట్టలేనంతగా దగ్గుతున్నాను ఇప్పుడు :-( (ఇది రాసిన సమయం లో)

నిరీక్షణ

అర్ధం కాని కవితలో
వ్యర్థమైన పదచిత్రం లా
చిక్కిపోయిన మనసు కి-
తెల్లని కాన్వాసు పై
పూర్తి కాని ఒక చిత్రం లా
అస్పష్టమైన భావం!

కవెప్పుడు స్వేచ్ఛనిస్తాడో!
చిత్రకారుడెప్పుడు పూర్తి చేస్తాడో!

3-02-07
యోగానంద్

Wednesday, February 28, 2007

Haiku-9

వీచే గాలి తో
మమేకమవుతూ
చెట్టుకొమ్మలు...

2-28-07
యోగానంద్

ఓ టీ తాగుతున్న సమయం లో...

కథ లోని పాత్ర
బాలేదని
పాఠకుడి ఏడుపు

రోడ్డు మీద రాయి
తగిలిందని
పథికుడి ఏడుపు

***

తన చేతిలో కప్పు
ఖాళీ చేసి
పిపాసి మౌనంగా నవ్వు...

2-28-07
యోగానంద్

Thursday, February 22, 2007

Haiku-8

పోతున్న సూరీడు,
సముద్రం లో దారి-
వలసపోతున్న పక్షులు...

2-25-07
యోగానంద్

PS: ముందు రాసిన హైకూ సవరించ మని చెప్పిన స్నేహితుడు సుబ్బు (మూలా సుబ్రహ్మణ్యం) కి ధన్యవాదాలతో!


Wednesday, February 21, 2007

Waterfall (Photography)


My Buddy Raghuveer's Photography....
He allowed me to use this as my blog display pic.

Feel free to visit his link at:

http://www.photo.net/photos/Raghuveer Makala

Saturday, February 17, 2007

Haiku-7

మబ్బులన్నీ పోయాయి
ఆకాశం-
నిర్మలంగా...

2-17-07
యోగానంద్

Haiku-6

వాన చినుకులు-
అద్దం మీద జారుతూ
ఏవేవో బొమ్మలేస్తున్నాయి

2-17-07
యోగానంద్

Thursday, February 15, 2007

Haiku-5

తెల్లారుతూనే 880 మీద పరుగు...
ప్రశాంతంగా సినీవాలి...
అందరి కళ్ళ కిందా నిదురిస్తూ!

2-15-07
యోగానంద్

PS: 880 అంటే Interstate Highway 880, అని SF Bay Area లో San Jose ని Sanfrancisco కి కలిపే ఒక Highway(Freeway). ఈ కళ్ళ కింద సినీవాలి పద చిత్రం ఝుంపా లాహిరి తన కథల సంపుటి (Interpreter of Maladies) లో ఒక కథ లో చెప్పింది. ఆ పద చిత్రాన్నే ఇక్కడ నేను వాడాను.

Haiku-4

అంతం లేని రోడ్డది-
పొడుగునా "రెడ్ లైట్లు"...
అందరూ ఆగి, ఏగిపోతున్నారు.

2-15-07
యోగానంద్

Sunday, February 11, 2007

Haiku-3

లైబ్రరీ నిశ్శబ్దం లో
పుటల చప్పుడు-
ఒక దాని తరవాత ఒకటి...

2-11-07
యోగానంద్