Thursday, February 03, 2011

క్యూబన్ చుట్ట (Cuban Cigar)

నీ చేతుల తో తాకి
నిప్పంటిస్తావు!
నీ పెదవులతో
నా జీవాన్ని, జవాన్ని
కసి గా జుర్రుకుంటావు...

నీ మోహానికి, వ్యామోహానికి
నేను కాలి తెరలు తెరలు గా
తరిగి పోతూ
నీ నర నరాల్లో సమ్మిళితమై...
కృంగి కృశించి పోతుంటే
నీకు ఆనందం!

నా తావి ఉన్నంతవరకే
నీ మోవి కి, నాకూ ముడి

******************
వివాహం వ్యాపరమైనపుడు
విడాకులు కొనుగోళ్ళు అయినపుడు
ఆలుమగల సంబంధం
ఒక చట్టబద్ధమైన బంధమే కదా!

యోగానంద్
02-03-2011




ప్రవాహం

పెను లోతులు తవ్వుతూ
అక్షర శిల్పాలను చెక్కుతూ
అనర్గళంగా ప్రవహించే
కొలొరాడో నది లా -
మస్తిష్క లోలోతుల్లో
నేను పయనిస్తూ ఉంటా

ఆనకట్ట లా!
నాకు లొంగి
నాలో కలిసిపోతాయి!
నా శక్తి కి రూపాన్నిస్తాయి...

నన్నందరూ గ్రహించలేరు...
కొందరు మాత్రం-
నాలో మమేకమై
మళ్లీ జన్మిస్తారు

అగ్ని గర్బం లోంచి
పుట్టిన సెకోయా చెట్ల లా
ఆకాశాల్నేదిరిస్తూ
పైపైకెదిగిపోతారు
సంశప్తకులై...
కవులై నిలుస్తారు!

03-31-2007
యోగానంద్

ఈ కవిత కి మూడేళ్ళ క్రితం వంగూరి సంస్థ వారి కవిత రచన పోటీ లలో మొదటి బహుమతి వచ్చింది. ఇది ఇక్కడ (నా బ్లాగ్) లేదని గ్రహించి మళ్లీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నా...