Thursday, December 29, 2005

విమాన యానం!

పోదామా పోదామా!
ఎగిరీ పోదామా!
ఆకాశ దారుల పోదామా!
ఎగిరీ పోదామా!

చేదామా చేదామా!
గగన విహారం చేదామా!
హరులమై, విహారులమై
ఆ గగనాన్నేల్దామా!


ఆడదామా ఆడదామా!
ఒకాటాడదామా!
ఆ దూది పింజల తో,
ఆ తెల్లని పూ బంతి తో,
ఆ ఎర్ర మందారం తో,
ఈ నిండు తోటలో పూలన్నిటితో,
ఆడుకుందామా!
ఒకాటాడదామా!
ఆడుకుంటూ పోదామా!

పాడెదమా పాడెదమా!
గగన బాటల మనసు మాటల
తెలుగు పాటలు పాడెదమా!
ఆహా!
సోయగమా సోయగమా!
ఈ విమాన యానం సోయగమా!
...

కందామా కందామా!
ఉన్నత స్వప్నం కందామా!
విందామా విందామా!
మనసు మాట మనం విందామా!
అందామా అందామా!
పట్టు వీడమని అందామా!
పొందేమా పొందేమా!
విజయం మనం పొందేమా!
...

పోదామా పోదామా!
ఝుమ్మంటూ సైయ్యంటూ

దూసుకుపోదామా!
ఎగిరీ పోదామా!
ఎగసీ పోదామా!
పోదామా పోదామా...

12-29-05
యోగానంద్

విమానమెక్కినపుడు ఈల వేసుకుంటూ పాడుకునే ఇమేజ్ బావుంటుంది ఈ కవిత కి :-)
పైలట్ సీట్ లో కూర్చుంటే ఇంకాను! మొట్టమొదట విమానయానం చేసినపుడు ఉత్సాహం ఈ రీతి గానే ఉంటుందనొచ్చేమో :-)

ఎందుకిలా!

ఎందుకిలా! ఎందుకిలా!
వేవో ఘోషలు వినబడతాయి,
ఎన్నెన్నో బాటలు కనబడతాయి!
ఎందుకిలా! ఎందుకిలా!
ఈ ఘోషల బాటలూ, బాటల ఘోషలూ
మనసునిలా తడపెడతాయి!

ఎందుకిలా! ఎందుకిలా!
మరీచికలు మదిని మరీ కర్షిస్తాయి!
కలరేపుచు వగచూపుచు, సంఘర్షణ రేగిస్తాయి!
ఎందుకిలా! ఎందుకిలా!
ఈ ఆకర్షణ సంఘర్షణలూ, సంఘర్షణ ఆకర్షణలూ
మనసునిలా కృంగిస్తాయి!

ఎందుకిలా! ఎందుకిలా!
తీరలేని తీపికలలు ప్రతి నిత్యం చిగురిస్తాయి,
కలలుగనే ఈ కవితలు అను నిత్యం వికసిస్తాయి!
ఎందుకిలా! ఎందుకిలా!
ఈ కలల కవితలూ, కవితల కలలూ
మనసునిలా ఊరిస్తాయి!

ఎందుకిలా! ఎందుకిలా!
ఈ కాల చక్రాలు సుడిరేపుతు భయపెడతాయి!
శమించకా, శాంతించకా మదిని కదలి కంపిస్తాయి!
ఎందుకిలా! ఎందుకిలా!
ఈ చక్రాల కంపనలూ, కంపనల చక్రాలూ
జీవినిలా వణికిస్తాయి!

ఎందుకిలా! ఎందుకిలా!
లోకమాశతో ఎదురుచూస్తుంది
శాంతి లేక భ్రాంతి లోనే అనుక్షణం జీవిస్తుంది!
ఎందుకిలా! ఎందుకిలా!
ఈ ఆశల భ్రాంతుల లో, భ్రాంతుల ఆశలలో
కృంగి కృంగి విలపిస్తుంది...

08-09-05
యోగానంద్

ఇది సుజనరంజని (బహుసా) మార్చి ఇస్స్యూ లో ప్రచురింపడుతోంది...ఎందుకో ఈ కవిత నాకు చాలా నచ్చుతుంది. అందుకే ఇక్కడ కూడా పొస్ట్ చేస్తున్నందుకు క్షమించండి! తెలుసు నాకు ఒక వేళ మీరు నా లైవ్ జర్నల్ చదువుతూ ఉంటే కొంచెం విసుగ్గానే ఉంటుంది. కానీ, రాన్నున్న కవితలన్నీ ఎలాగో ఈ బ్లాగ్ లోనే పొస్ట్ చేస్తా...

మాయ!

దరినున్న విలువా
దూరాననే చేరువా!

కనులనున్న కలవా
కను తెరువ కరిగేవా!

మదిని మెదిలే ఆశయానివా
కుదిలి కూలే గాలి మేడవా !

ఎగసి ఎగిరే విహంగానివా
వగసి ఇగిరే దేహానివా!

కాపాడే కనబడే నిజానివా
కాల్చేసే కనబడని నిప్పువా!

మాట వినని మనసువా!
అసలు...
"నా మాటేనాడైనా విన్నావా?"
అంటావా!

12-21-05
యోగానంద్

ఈ కవిత కి పేరు ఏమి పెట్టాలో తెలీట్లేదు..ప్రస్తుతానికి మాయ అంటున్నా. కానీ ఎందుకో మాయ సరిపోలేదేమో అనిపిస్తుంది.

Tuesday, December 27, 2005

మాటలు

గోడ మీద వ్రాతలు
పాడె మీద కట్టెలు...
నిలువలేవవి కాలాగ్ని భుగభుగలు
కలిసిపోతాయి శాశ్వతంగా!

నిలుపు మాటలు మదిలోన
గెలుపు నీదిక ఇలలోన
నిలుస్తాయవి కలిసొచ్చిన కాలంతోను
కలిసెడతాయి చిరస్మరణీయంగా!

12-27-05
యోగానంద్

వివరణ:అన్వేషి అనే ఒక తెలుగు బ్లాగర్ (www.anveshi.blogspot.com) తన కామెంట్స్ లో "గోడ మీద రాసుకున్నా", అంటేఈ పై వాక్యాలు తట్టాయి.


శ్రీశ్రీ కవి కి!

పెను నిద్దర వదిలించి
ఆవేశం రగిలించి
రక్తాన్ని మండించి
కదన శంఖం పూరించి
... కవీ నీ పాటల్!

నవరసాలు చూర్ణించి
రౌద్రం లో క్రాగించి
స్వాదుదుగ్ధం పొంగించి

ఆ అమృతాంబుధి లో ముంచి
... కవీ నీ పాటల్!

ఛాయా సప్త హయ పరుగులు
శరత్కౌముది జడివానలు
కుందకుందన తెలుగు ప్రాసలు
అరుణ కరుణ మణిపూసలు
... కవీ నీ పాటల్!

మహాకవీ!

నీ డెంద స్పందన, భావ ప్రకంపన
హృద్గర్జన, వచన కవన కైరవిణీ,
కవన వచన హరిన్మణీ,
నులివెచ్చని నీ కవనఘృణి లో
తెలిమంచునై కరిగిపోతిని
నన్ను నేనే మరచిపోతిని!
నన్ను నేనే మరచిపోతిని!

03-06-05

యోగానంద్

వివరణ:జనవరి 2nd శ్రీశ్రీ జయంతి సందర్భంగా...

ఈ కవిత ఆనాడు శ్రీశ్రీ స్విన్బర్న్ కవికి రాసిన శైలి లో ఉంటుంది.


మహాకవి శ్రీశ్రీ

ఈ బ్లాగు లో మొట్టమొదటి పోస్టు నేను మహాకవి శ్రీశ్రీ కి అంకితం ఇస్తున్నా.
http://www.mahakavisrisri.com/
వెబ్సైట్ లో మొదట ఆయన గురించి చదవడం మొదలెట్టా. చిన్నపుడు ఆయన గురించి విన్నా సరే, మరీ అంత గొప్ప కవి అని నాకు ఎప్పుడూ తెలీలేదు! అమెరికా వచ్చి, ఈ వెబ్సైట్ లో చదివితే గానీ నాకు తెలీలేదు ఆయన గొప్పతనం. ఆ మధ్య ఒక సారి మా స్నేహితుడు ఒకతను (బాచి అంటూ ఉంటా), "మహాప్రస్థానం పుస్తకం చదువు నువ్వు, సీరియస్ మనిషివై అయితేనే చదవాలి" అంటే, అది ఒక నవల ఏమో అనుకున్నా, తరువాత అలా వెబ్ లోనూ, పైగా ఇంకో స్నేహితుడి ద్వారా ఇండియా నుంచి తెప్పించుకున్నాక తెల్సింది, మహాప్రస్థానం ఒక కవితల సంపుటి అని! అంతే అది చదవగానే ఏదొ తెలీని లోకాలకు వెళ్ళినట్టనిపించింది. ఒక్కసారిగా ఆ కవితల ప్రవాహం లో కొట్టుకుపోయా! నాకే తెలీలే. అంతే ఒక్క ఉదుటున నేను కూడా రాయడం ప్రారంభించా. కవిత్వం లో ఉన్న ఆనందం ఇంతా అంతా కాదు. అసలు తెలుగు పదాలతో ఆడుకుంటుంటే అదొక తియ్యటి అనుభూతి! తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వం, ఆనందం కలిగాయి. అదొక తెలుగు ఉదయం, దర్శనం కలిగినట్లు అనిపించింది.

ఆ కాలం శ్రీశ్రీ లాంటి వాళ్ళు ఇలా తెలుగు లో అందాన్ని వెలికి తీసారు కాబట్టే, నాకు ఇంత ఆబిమానం పుట్టుకొచ్చింది కనుక, అటువంటి మహాకవులకు, రచయితలకు, తెలుగు చదివితే, వ్రాస్తే వచ్చే ఆనందాన్ని సమర్పణ చేసుకుంటున్నా.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శ్రీశ్రీ ది కూడా మా ఊరే, విశాఖపట్నం. అయినా నాకు ఆయన గురించి తెలీకపోవడం వల్ల ఎంత బాధపడ్డానో నాకే తెలీదు. బహుసా ఆయనని నేను ఎక్కడో సప్త సముద్రాలవతల ఈ అమెరికా లో ఇరవై ఏడవ సంవత్సరం లో కనుగొనే యోగం ఉందేమో, అందుకే ఇన్నాళ్ళూ అసలు తెలుగుని కూడా పెద్దగా అభిమానించిన గుర్తు కూడా లేదు. ఇప్పుడు తెలుగంటే ఎందుకో విపరీతమైన అభిమానం పుట్టుకొస్తోంది.ఆ తెలుగు పదాలు, మాటలు, తెలుగు వాక్యాలు, అబ్బ! ఎంత ఆనందాన్నిస్తాయో వర్ణించనేలెము!


సరే ఇక మళ్ళీ శ్రీశ్రీ విషయానికి వద్దాం. కవిత్వం ఆయన రాసిన లిరికల్ స్టైలే కాకుండా, నాకు ఆయన మీద ఆబిమానం ఎందుకంటే, ఒక వినూత్న విప్లవం తీసుకొచ్చారు. అసలు అప్పటిదాక ఉన్న శైలి ఎందులోనూ ఆయన రాయలేదు. అందరు గొప్ప కవులూ ఇలా మొదలెట్టిన వాళ్ళే. తరువాత శ్రీశ్రీ పడ్డ కష్టాలు ఇంతా అంతా కాదు, ఒకప్పుడు పిచ్చివాడని ప్రచారం కూడా చేసారు. అంతే కాక, అరెస్టు కూడా చేసారు. నేను కమ్మ్యూనిస్టుని కాకపోయినా, ఆయన పోరాడిన విధానం, నాకు ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. ఎన్ని కష్టాలొచ్చినా ఎంత మంది ఎదురైనా, నిలిచి పోరాడిన వాడే హీరో. అందుకు నాకు శ్రీశ్రీ అంటే మరింత గౌరవం, అభిమానం. ఎవ్వరూ నడవని బాటలో ఉన్న కష్టాలకి, కంటక పోట్లకీ భయపడక ఎదురుతిరిగి ధైర్యంగా నిలిచిన వాళ్ళే చిరస్మరణీయంగా నిలుస్తారు. నాలో తెలుగు చైతన్యానికి కారణమైన ఆ మహాకవి శ్రీశ్రీ కి కృతఙతలతో ఈ నా తెలుగు బ్లాగు ప్రారంభం.
యోగానంద్